రేవంత్‌ రాజీనామా | Sakshi
Sakshi News home page

రేవంత్‌ రాజీనామా

Published Sun, Oct 29 2017 1:07 AM

 T-TDP Working President Revanth Reddy Quits Party 

సాక్షి, హైదరాబాద్‌/అమరావతి:
తెలుగుదేశం పార్టీ ముఖ్యనేత అనుముల రేవంత్‌రెడ్డి ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వంతోపాటు పార్టీ పదవులకు, శాసన సభ్యత్వానికి రాజీనామా చేశారు. టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడుతో శనివారం భేటీ అయిన ఆయన.. అనంతరం రాజీనామా లేఖలను అందించారు. తన పోరాటాలకు ఎన్టీఆర్‌ స్ఫూర్తి అని, టీడీపీతో బంధం తెంచుకోవడం గుండెకోతతో సమానమని అందులో పేర్కొన్నారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ అరాచక పాలన సాగుతోందని, రాష్ట్రం కేసీఆర్‌ కుటుంబం చేతిలో బందీ అయిందని వ్యాఖ్యానించారు. వారి నియంతృత్వ పాలన నుంచి తెలంగాణకు విముక్తి కలిగించేందుకు.. కేసీఆర్‌కు వ్యతిరేకంగా రాజకీయ పునరేకీకరణలో భాగంగా తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఇక ఎమ్మెల్యే పదవికి స్పీకర్‌ ఫార్మాట్‌లో ఏకవాక్య రాజీనామా లేఖను రాసిన రేవంత్‌.. దానిని తెలంగాణ శాసనసభ స్పీకర్‌కు అందజేయాలని కోరారు.

సీఎం కార్యదర్శికి రాజీనామా లేఖ ఇచ్చి..
ఏపీ సీఎం చంద్రబాబు శనివారం విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. పార్టీలోని పరిస్థితులు, రాజీనామాకు దారితీసిన అంశాలను చంద్రబాబుకు వివరించారు. స్వల్పకాలంలోనే టీడీపీలో అత్యున్నత స్థాయి అవకాశాలు కల్పించినందుకు కృతజ్ఞతలు కూడా తెలిపారు. కొంతసేపు వ్యక్తిగతంగా మాట్లాడే అవకాశమివ్వాలని చంద్రబాబును కోరారు. కానీ కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో ఢిల్లీలో సమావేశం, కాంగ్రెస్‌ వాళ్లతో భేటీల వంటివాటన్నింటికీ ఆధారాలున్నాయని, ఇంకా మాట్లాడేదేముందని చంద్రబాబు వ్యాఖ్యానించినట్టు తెలిసింది.

అయినా విడిగా మాట్లాడడానికి రేవంత్‌ ప్రయత్నించినా.. చంద్రబాబు వినలేదని సమాచారం. చివరికి వెళ్లిపోయేందుకు రేవంత్‌ లేచి నిలబడ్డారు. దీంతో ‘వెళుతున్నావా?’అని రేవంత్‌ను చంద్రబాబు అడిగారని, తాను ప్రెస్‌మీట్‌లో మాట్లాడివచ్చే దాకా ఉండాలని చెప్పి బయటకు వచ్చినట్లు తెలిసింది. ఈ సమయంలో చంద్రబాబుకు నమస్కరించిన రేవంత్‌.. బాబు బయటకు వెళ్లగానే సీఎం కార్యదర్శి రాజమౌళికి తన రాజీనామా లేఖలను ఇచ్చి బయటికి వచ్చేశారు. మీడియాతో కూడా మాట్లాడకుండా వెళ్లిపోయారు.

రేవంత్‌ వ్యక్తిగత కారణాలతోనే..: పెద్దిరెడ్డి
రేవంత్‌ వెళ్లిపోయిన గంటన్నర తర్వాత చంద్రబాబు టీటీడీపీ నేతలతో సమావేశమై చర్చించారు. అనంతరం ఈ భేటీ వివరాలను టీటీడీపీ నేత పెద్దిరెడ్డి విలేకరులకు వివరించారు. భేటీలో రేవంత్‌ విషయం చర్చకు వచ్చిందని, ఆయన మామూలుగానే సమావేశానికి వచ్చి అందరితో గౌరవంగా మాట్లాడాడని చెప్పారు. పార్టీకి రాజీనామా చేయడానికి రేవంత్‌కు వ్యక్తిగత అంశాలు కారణం కావొచ్చన్నారు. ఇక తెలంగాణ పార్టీకి మరింత ఎక్కువ సమయం కేటాయించాలని చంద్రబాబును కోరామని.. ఇక ముందు ప్రతి నెలా సమీక్ష నిర్వహిస్తానని చెప్పారని వెల్లడించారు. నవంబర్‌ రెండో తేదీన హైదరాబాద్‌లో టీటీడీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. చంద్రబాబుతో జరిగిన భేటీలో టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌ రమణ, నామా నాగేశ్వరరావు, మోత్కుపల్లి నర్సింహులు, రావుల చంద్రశేఖరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రేపు వెల్లడిస్తా..: రేవంత్‌
కొడంగల్‌: తన నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో చర్చించాక సోమవారం హైదరాబాద్‌లో తన భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తానని రేవంత్‌రెడ్డి అన్నారు. ఏపీ రాజధాని అమరావతిలో చంద్రబాబును కలసి టీడీపీ సభ్యత్వం, పదవులకు రాజీనామా చేసిన ఆయన.. అనంతరం నేరుగా వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌కు చేరుకున్నారు. అక్కడ నాయకులు, కార్యకర్తలు రేవంత్‌కు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రేవంత్‌ ఆదివారం నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో సమావేశమై చర్చిస్తానని చెప్పారు. భవిష్యత్తు కార్యాచరణను సోమవారం వెల్లడిస్తానన్నారు.

రేవంత్‌ రాజీనామా లేఖ సారాంశమిదీ..
‘‘నా పోరాటాలకు ఎన్టీఆర్‌ కూడా స్ఫూర్తి. ‘సమాజమే దేవాలయం – ప్రజలే దేవుళ్లు’ అన్న నందమూరి ఆలోచనకు మించిన సిద్ధాంతం లేదు. ఎన్టీఆర్‌తో నేరుగా అనుబంధం లేకపోయినా పేదల బాగు కోసం ఆయన పరితపించిన విధానం నాలో స్ఫూర్తిని నింపింది. తెలుగుదేశంతో బంధం తెంచుకోవడం గుండెకోతతో సమానం. తెలంగాణ సీఎం కేసీఆర్‌ అరాచకాలను టీడీపీ ద్వారానే అంతమొందించాలని కోరుకున్నా.. కేసీఆర్‌ సారథ్యంలోని టీఆర్‌ఎస్‌ పాలన ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేసింది. అమరవీరులు, ఉద్యమకారులు, నిరుద్యోగులు, విద్యార్థులు, రైతులు, దళిత, గిరిజన, మైనారిటీలు, బీసీలు, మహిళలు ఇలా ఏ వర్గాన్ని చూసినా కన్నీళ్లు కష్టాలే కనిపిస్తున్నాయి.

వేల మంది రైతులు పిట్టల్లా రాలిపోతున్నా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. ఖమ్మంలో అమాయక గిరిజన రైతులకు బేడీలు వేసి నడిరోడ్డుపై నడిపించి, ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు. భూసేకరణ పేరుతో మల్లన్నసాగర్‌ ప్రాంతాన్ని రావణకాష్టంగా మార్చారు. నేరెళ్లలో దళిత, బీసీ బిడ్డలపై పోలీసులు అన్యాయంగా «థర్ట్‌ డిగ్రీ ప్రయోగించారు. భూపాలపల్లి జిల్లాలో ఎన్నో ఏళ్లుగా అటవీ భూముల్లో పోడు చేసుకుంటున్న గిరిజనులపై ప్రభుత్వ ఆదేశాలతో పోలీసులు లాఠీలతో విరుచుకుపడ్డారు. గుత్తి కోయ ఆడబిడ్డలను బట్టలూడదీసి, చెట్లకు కట్టేసి కొట్టిన పరిస్థితులు హృదయవిదారకం. చదువుకుంటున్న విద్యార్థులను నక్సలైట్ల ముద్రతో ఎన్‌కౌంటర్‌ చేసిన ఘటనలు ఆవేదన కలిగించాయి.
గొంతు నొక్కేస్తున్నారు..

ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతులను నొక్కేస్తున్నారు. ప్రతిపక్షాల ఉనికిని కేసీఆర్‌ సహించలేక, ప్రజాస్వామిక హక్కులకూ చోటులేకుండా చేస్తున్నారు. అత్యున్నత వ్యవస్థలను తన అధికార దర్పానికి కాపలాకాసే సంస్థలుగా మార్చుకున్నారు. తెలంగాణలో ప్రజాస్వామిక వ్యవస్థల విధ్వంసం నిరాఘాటంగా సాగుతోంది. ఈ దుర్మార్గాలపై మూడేళ్లుగా అసెంబ్లీలోనూ, వెలుపలా టీడీపీ పోరాటం చేస్తోంది. సభలో ప్రజల గొంతుక వినిపించే ప్రతి సందర్భంలో సస్పెన్షన్‌ వేటు వేశారు. ఈ నేపథ్యంలోనే రైతు పోరు, విద్యార్థి పోరు, ప్రజా పోరు, కార్మిక పోరు వంటి ఉద్యమాలతో ప్రజలను చైతన్యపరిచాం. నాపై పాలకులు వ్యక్తిగతంగా కక్ష గట్టి, అక్రమ కేసులతో వేధించిన విషయం మీకు తెలిసిందే. అరెస్టు చేసి జైల్లో పెట్టిన సందర్భంలోనూ నేను వెనకడుగు వేయలేదు. నా బిడ్డ నిశ్చితార్థానికి కోర్టు కొన్ని గంటలు మాత్రమే అనుమతించిన సందర్భంలోనూ గుండె నిబ్బరం కోల్పోలేదు. ఆ సందర్భంలో నాకు, నా కుటుంబానికి మీరిచ్చిన మద్దతును ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాం.
ప్రమాదంలో తెలంగాణ సమాజం

ప్రస్తుతం తెలంగాణ సమాజం ప్రమాదపుటంచుల్లో ఉంది. కేసీఆర్‌ కుటుంబం చేతిలో బందీ అయింది. బంగారు తెలంగాణ ముసుగులో ప్రజాసంపద అడ్డగోలుగా దోపిడీ అవుతోంది. ప్రజలు ఏ ఆకాంక్షలతో స్వరాష్ట్రం కోరుకున్నారో వారి ఆశలు కలలుగానే కరిగిపోతున్నాయి. అమరవీరుల ఆత్మ బలిదానాలకు గుర్తింపు లేదు. తెలంగాణ సమాజం ఏకతాటిపై నిలబడి కేసీఆర్‌ కుటుంబ నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అనివార్యత కనిపిస్తోంది. ఈ సందర్భంలో ప్రజలు ఎన్నుకున్న నాయకుడిగా వారి పక్షాన నిలవడమే ప్రాధాన్యమని నమ్ముతున్నాను. తెలంగాణ సమాజ హితం కోసం నేను మరింత ఉధృతంగా పోరాటం చేయాల్సిన పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి.

కేసీఆర్‌ కుటుంబం నుంచి తెలంగాణ సమాజానికి విముక్తి కల్పించడం బాధ్యతగా భావిస్తున్నా.. తెలంగాణ సమాజం కేసీఆర్‌కు వ్యతిరేకంగా బలమైన రాజకీయ పునరేకీకరణ కోరుకుంటోంది. నా నిర్ణయాన్ని మీరు ఆ కోణంలోనే చూడండి. ఈ నేప«థ్యంలో పార్టీ తెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్ష పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి, శాసనసభ సభ్యత్వానికి రాజీనామా సమర్పిస్తున్నా. పార్టీ అధ్యక్షుడిగా, మార్గదర్శిగా మీరు ఇచ్చిన పోరాట పటిమ, స్ఫూర్తి గుండెల నిండా నింపుకొని తెలంగాణ సమాజ హితం కోసం విస్తృత పోరాటానికి సిద్ధమవుతున్నాను.
అన్యధా భావించక.. నా నిర్ణయాన్ని సహృదయంతో అర్థం చేసుకుంటారని..– అనుముల రేవంత్‌రెడ్డి

Advertisement
Advertisement